Hyderabad: కోడి కూర వండలేదని ప్రాణాలు తీసుకున్నాడు!

  • భార్యను కూర వండాలని కోరిన సత్యనారాయణ
  • సాయంత్రం చేస్తానని చెప్పడంతో ఆత్మహత్య
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

ఇటీవలి కాలంలో చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్య తాను అడగగానే కోడికూర వండకపోవడంతో మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పశ్చిమ గోదావరి జిల్లా కానూరు అగ్రహారం ప్రాంతానికి చెందిన సత్యనారాయణ భార్య దేవకి, కుమారుడు ధనశేఖర్, కుమార్తె మల్లేశ్వరీతో కలసి యూసఫ్ గూడ సమీపంలోని జవహర్ నగర్ లో ఉంటున్నాడు. గత 8 ఏళ్లుగా వీరు ఇక్కడే కూలి పని చేసుకుంటున్నారు. కొద్దికాలం క్రితం మద్యానికి బానిసైన సత్యనారాయణ.. పనికి వెళ్లడం మానేశాడు. గురువారం ఉదయం పూటుగా మద్యం తాగొచ్చి భార్యను చికెన్ కూర వండాలని కోరాడు. అయితే కూర సాయంత్రం వండుతానని చెప్పి, కొడుకుతో కలసి దేవకి పనికి వెళ్లింది.

తాను చెప్పినా కూర వండలేదని మనస్తాపం చెందిన సత్యనారాయణ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సాయంత్రం ఇంటికొచ్చిన దేవకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
suicide
chicken curry
yousufguda
jublee hills
  • Loading...

More Telugu News