dr.silpa: శిల్ప ఆత్మహత్య కేసు.. రుయాలో విధులు బహిష్కరించిన డాక్టర్లు!
- గంట పాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు దూరం
- జ్యూడీషియల్ విచారణ జరపాలని డిమాండ్
- ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లను తప్పించడంపై ఆగ్రహం
తిరుపతి రుయా ఆస్పత్రిలో పీజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ఆత్మహత్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా శిల్ప బలవన్మరణం కేసులో రుయా ప్రిన్సిపాల్ తో పాటు ముగ్గురు ప్రొఫెసర్లపై వేటు వేయడంపై అక్కడి ప్రభుత్వ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం తిరుపతిలో అత్యవసరంగా సమావేశమైన వైద్యులు.. ప్రభుత్వ చర్యలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోజూ ఓపీ సేవల సందర్భంగా గంట పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్ని బహిష్కరిస్తామని తెలిపారు.
శిల్ప మృతికి సంతాపం తెలిపిన రుయా డాక్టర్లు.. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. శిల్ప చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నెల 13న తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ శిల్ప బలవన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్ సీఎం చంద్రబాబుకు నివేదికను సమర్పించారు. దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రుయా వైద్య కళాశాల, ఆస్పత్రిలో పీజీ చదువుతున్న డా.శిల్ప పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆగస్టు 8న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. శిల్పను ప్రొఫెసర్లు లైంగికంగా వేధించారనీ, లొంగకపోవడంతో ఫెయిల్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.