jana sena: నేనేమైనా జగన్‌నా.. అలా చెప్పడానికి?: పవన్ కల్యాణ్
- నేను కులాన్ని నమ్ముకుని రాలేదు
- బాబు-జగన్ మధ్య రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు
- ఐదేళ్లు ఉండి పోవడానికి రాలేదు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ చీఫ్ జగన్‌లపై దుమ్మెత్తి పోశారు. తనను ముఖ్యమంత్రిని చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడానికి రాలేదని జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. తాను ఐదేళ్లు ఉండి వెళ్లిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. అధికారం సాధించడానికి ప్రశ్నించడం తొలి మెట్టని పేర్కొన్నారు. చంద్రబాబులాగా నన్ను సీఎంను చేయండని, జగన్ లాగా.. నన్ను సీఎంను చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడానికి తాను ఇక్కడకు రాలేదని పవన్ స్పష్టం చేశారు. ప్రజలకు అండగా ఉండడానికి మాత్రమే వచ్చానన్నారు.
బీజేపీతో తనకు లోపాయికారీ సంబంధాలున్నాయన్న వార్తలపైనా పవన్ స్పందించారు. ప్రధాని మోదీ తనకు బంధువు కాదని, స్నేహితుడు అంతకంటే కాదని తేల్చి చెప్పారు. వైసీపీ, టీడీపీల దోపిడీలు ఇక చాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, జగన్ మధ్య నలిగిపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని పవన్ స్పష్టం చేశారు.