gvl: నా దగ్గర వంద కోట్ల ఆస్తులు ఉంటే బయటపెట్టండి: జీవీఎల్ సవాల్
- నిరూపించలేకపోతే అంతే విలువ చేసే ఆస్తులు కొనిపెట్టండి
- నాకు చెక్కు రాసివ్వండి
- అందులో రూ.10 కోట్లు ఏపీ జర్నలిస్టులకు ఇస్తా
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వద్ద వంద కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై జీవీఎల్ స్పందించారు. తన వద్ద వంద కోట్ల ఆస్తి ఉంటే, బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఆ ఆస్తులు తనవి కాదని తేలితే అంతే విలువ చేసే ఆస్తులను టీడీపీ తనకు కొనిపెడుతుందా? అని ప్రశ్నించారు.
తనకు చెక్కు రాసిస్తే, అందులో రూ.10 కోట్లు ఏపీ జర్నలిస్టుల కోసం ఇస్తానని వ్యంగ్యాస్తాలు సంధించారు. తనకు ఉన్న ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నానని, 1993లో కొన్న ఆస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.28 కోట్లు అని, తాను నెంబర్ వన్ సెఫాలజిస్ట్ ను అని చెబుతూ, తన సొంత సెఫాలజీ సంస్థ ‘డీఆర్ఎస్’ను 1997లో ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు.