flipkart: స్వయంగా డెలివరీ అందించేందుకు వెళ్ళా: బిన్ని బన్సల్
- అమేజాన్ లో 8 నెలలే పనిచేశా
- నా వల్ల సచిన్ బోనస్ ను వదులుకున్నాడు
- ఓ కస్టమర్ అభిమానాన్ని తట్టుకోలేకపోయా
ఫ్లిప్ కార్ట్.. దాదాపు 11 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఈ-కామర్స్ వెబ్ సైట్ గతేడాది రూ.19,982 కోట్ల ఆదాయాన్ని అర్జించింది. త్వరలో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తో జట్టుకట్టబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఫ్లిప్ కార్ట్ ను ఎలా ప్రారంభించారో బిన్నీ బన్సల్ మీడియాతో పంచుకున్నారు.
2005-06 మధ్యకాలంలో తాను ఉద్యోగం కోసం గూగుల్ కు రెండుసార్లు దరఖాస్తు చేశాననీ, కానీ గూగుల్ మాత్రం తన అప్లికేషన్ ను రిజెక్ట్ చేసిందని వ్యాఖ్యానించాడు. ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తనను అమేజాన్ లోకి రెఫర్ చేశాడని బిన్నీ చెప్పాడు. సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తనను రెఫర్ చేయడం ద్వారా సచిన్ భారీ బోనస్ ను అందుకున్నాడని వెల్లడించారు. అయితే 8 నెలల తర్వాత అమేజాన్ లో తాను ఉద్యోగం మానేశాననీ, దీంతో తీసుకున్న బోనస్ మొత్తాన్ని తిరిగి కంపెనీకి సచిన్ చెల్లించాల్సి వచ్చిందన్నాడు.
బిగ్ బాస్కెట్ యాప్ నుంచి కాకుండా ఫ్లిప్ కార్ట్ నుంచి కూరగాయలు కొనేలా తన భార్యను ఒప్పించడమే ప్రస్తుతం తన ముందున్న ప్రధాన సవాలు అని బిన్నీ వ్యాఖ్యానించాడు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ సందర్భంగా తాము స్వయంగా డెలివరీ అందించేందుకు కొన్నిసార్లు వెళ్లామని బిన్నీ చెప్పాడు. ఈ సందర్భంగా చాలా మంది కస్టమర్లు తమను గుర్తు పట్టలేదన్నాడు. 'అయితే ఓ వ్యక్తి మాత్రం గుర్తుపట్టి సెల్ఫీ దిగడమే కాకుండా ఇంటికి తీసుకెళ్లి టీ, మిఠాయిలు పెట్టాడు. చాలు అన్నప్పటికీ ఆ కుటుంబం స్వీట్స్ కొసరి కొసరి పెట్టింది. మాకు కస్టమర్లు దేవుళ్లు అయినందున వాటిని కాదనలేకపోయా'నని బిన్నీ సరదాగా వ్యాఖ్యానించాడు.