APSRTC: ఆర్టీసీ ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చిన ఎన్ఎంయూకు ఎదురుదెబ్బ... ఈయూ ఐక్యకూటమి గెలుపు!

  • 2,399 ఓట్ల మెజారిటీతో ఈయూ ఐక్య కూటమి విజయం
  • జిల్లా ఎన్నికల్లోనూ ఈయూ హవా
  • 10 జిల్లాల్లో ఈయూ, 3 జిల్లాల్లో ఎన్ఎంయూ విజయం

నిన్న జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చిన ఎన్ఎంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) ఓడిపోయింది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ వైఎస్ఆర్ సీపీ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, ఎస్ డబ్ల్యూఎఫ్ (స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్)ల మద్దతుతో ఈయూ (ఎంప్లాయిస్ యూనియన్), ఎన్ఎంయూపై 2,399 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

నిన్న ఉదయం 5 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం వరకూ జరుగగా, 50,213 ఓట్లకుగాను 49,682 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిల్లో 49,430 ఓట్లను చెల్లినవిగా గుర్తించారు. వీటిల్లో 25,771 ఓట్లు ఈయూకు, 23,372 ఓట్లు ఎన్ఎంయూకు దక్కాయి. బహుజన వర్కర్స్ యూనియన్ కు 208, కార్మిక సంఘ్ కు 34, ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు 45 ఓట్లు వచ్చాయి.

ఇక జిల్లా గుర్తింపు సంఘాల ఎన్నికల్లోనూ ఈయూ ఐక్య కూటమి హవా నడిచింది. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో ఎన్ఎంయూ విజయం సాధించగా, మిగతా 10 జిల్లాల్లో ఈయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. రెండు సంవత్సరాల నాడు జరిగిన ఎన్నికల్లో ఎన్ఎంయూ 709 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటంతోనే కార్మికులు ఎన్ఎంయూకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News