Pawan Kalyan: చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే 120 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి!: పవన్ కల్యాణ్
- బాబు మాట ఇస్తారు కానీ నిలబెట్టుకోవాలని ఉండదు
- నేను మాటిస్తే 100 శాతం నిలబెట్టుకుంటా
- అందుకే, ఆచితూచి హామీలు ఇస్తాను
ఎలక్షన్ సమయంలో అడగడం పాపం .. ఎవరు ఏం అడిగినా రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఆటో యూనియన్లు, అసంఘటిత రంగ కార్మికులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 120 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. ఆయనకు మాట ఇవ్వడానికి మనసు ఉంటుంది కానీ.. దానిని నిలబెట్టు కోవడానికి ఉండదు. 2019 ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తుల వెనక నిలబడితే న్యాయం జరుగుతుందో లేదో ఒకసారి ఆలోచించుకోండి! నేను మాటిస్తే 100 శాతం నిలబెట్టుకుంటా. అందుకే ఆచితూచి హామీలు ఇస్తాను. హామీ ఇచ్చిన దాని కంటే 10 శాతం ఎక్కువే చేసి చూపిస్తాను.
ఉద్దండరాయునిపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో సమస్య వస్తే వారు గెలిపించిన వైసీపీ లీడర్లు నిలబడకపోయినా నేను వారికి బాసటగా నిలిచాను. టీడీపీ వాళ్లలాగా ఓట్లు వేసిన వాళ్లకే సంక్షేమ పథకాలు ఇచ్చే సంస్కృతి ‘జనసేన’లో ఉండదు. అందరిని సమానంగా చూడగలిగే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తాం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఆటో యూనియన్లను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. వారు ఆర్థికంగా, ఆరోగ్యంగా జీవించే పరిస్థితి ‘జనసేన’ కల్పిస్తుంది. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించడంతో పాటు మీపై వేధింపులకు దిగిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పవన్ కల్యాణ్ వారికి భరోసా ఇచ్చారు.
అన్ని కులాల బాగు కోసం ‘జనసేన’ కృషి చేస్తుంది
కాగా, అంతకుముందు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతోంది బ్రాహ్మణ సమాజమని అన్నారు. ఏ సమాజంలోనైనా పూర్వీకులు చేసిన తప్పులకు ఈ తరంవాళ్ళకి ఇబ్బందులు రాకూడదని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని కులాలు, మతాలకు అతీతంగా నడిపింది బ్రాహ్మణులేనని గుర్తు చేశారు. అప్పటి నాయకులు కులాలు, మతాలను సమానంగా చూసేవారనీ, ఇప్పటి నాయకుల్లో సంకుచిత భావం రావడం బాధాకరం అని అన్నారు. ఈ సంకుచిత భావాల వల్ల విపరీత ధోరణులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప, ఒక్క కులాన్ని నమ్ముకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. కులాల కుంపటి వల్ల దేశం విచ్ఛిన్నం కాకూడదని, అధికారం సహజంగా రావాలి తప్ప దాని కోసం పాకులాడకూడదు అని చెప్పారు. కులాన్ని ఓటు బ్యాంక్ గా చూడటం లేదని, అన్ని కులాల బాగు కోసం జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. జనసేన పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో త్వరలోనే తెలియజేస్తామని, పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఎన్నికల ముందు తీసుకొస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.