Pawan Kalyan: నాయీ బ్రాహ్మణులు ఏమైనా ఉగ్రవాదులా? డైనమైట్లు పేల్చే క్వారీ వ్యాపారులా?: పవన్ కల్యాణ్
- చంద్రబాబు వేలెత్తి బెదిరించడం నచ్చలేదు
- సీఎం సరిగ్గా పని చేస్తే ‘జనసేన’ అవసరముండేది కాదు
- అసంఘటిత రంగ కార్మికులతో పవన్ సమావేశం
నిర్లక్ష్యానికి గురైన కులాలకు ఇవ్వాల్సింది ఆత్మగౌరవమని, జనసేన పార్టీ అది ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఆటో యూనియన్లు, అసంఘటిత రంగ కార్మికులతో పవన్ ఈ రోజు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేలెత్తి నాయీ బ్రాహ్మణులను బెదిరించడం నచ్చలేదు. వాళ్లేమైనా ఉగ్రవాదులా? టన్నుల కొద్దీ డైనమైట్లు పేల్చే కర్నూలు క్వారీ వ్యాపారులా? విధి నిర్వహణలో ఉన్న మహిళాధికారిని కొట్టిన ఎమ్మెల్యేను ఏమీ అనరు. అడ్డగోలుగా ఇసుకను దోచుకున్న వారిని ఏం చేయరు.. కానీ స్వయం శక్తితో, వృత్తి నైపుణ్యంతో బతుకుతున్న నాయీ బ్రాహ్మణులు వచ్చి ‘మమ్మల్ని ఆదుకోండి’ అని అడిగితే మాత్రం బెదిరిస్తారా?
జనసేన పార్టీ నాయీ బ్రాహ్మణులను గుండెకు హత్తుకుంటుంది తప్ప, వేలెత్తి బెదిరించదు. కాస్త భృతి పెంచమనో, జీతం పెంచమనో, ఉద్యోగం ఇవ్వమనో అడిగితే బెదిరింపులకు పాల్పడతారా? జీతాలు పెంచితే నాయీ బ్రాహ్మణులూ బలపడిపోతారు అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడే ఆర్థికంగా బలపడాలా? సీఎం చంద్రబాబు మాట్లాడితే అన్ని కులాలకు న్యాయం చేశామని చెబుతారు, మీరు న్యాయం చేసినట్లు అయితే ఇంతమంది నాయీ బ్రాహ్మణులు నా దగ్గరకు ఎందుకు వస్తారు?
నిజంగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే జనసేన పార్టీ అవసరం ఉంటుందా? రాష్ట్రంలో ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరేమో ముఖ్యమంత్రిని చేస్తేనే సమస్యలు తీరుస్తాను అంటారు. మరొకరేమో ఇంకోసారి ముఖ్యమంత్రిని చేస్తే అద్భుతాలు చేస్తానని చెబుతారు. నేను మాత్రం ఓట్లు వేసినా వేయకపోయినా మీకు అండగా నిలబడతా. కార్పొరేట్ సంస్థలతో సమానంగా నాయీ బ్రాహ్మణులు పోటీ పడే విధంగా నైపుణ్యం పెంచడంతోపాటు విదేశాల్లోని కేశాలంకరణ నిపుణులను తీసుకొచ్చి శిక్షణ ఇప్పించడం, ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. మన వృత్తిని మనం గౌరవించుకొనే విధంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి’ అని పవన్ అన్నారు.