BALU: ఇంతవరకు రాయల్టీ కింద ఒక్క రూపాయి కూడా రాలేదు!: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

  • పాటలపై గాయనీ గాయకులకు రాయల్టీ హక్కులు 
  • నా పాటలకు రాయల్టీ ఇస్తే ఎప్పుడో రిటైర్ అయ్యేవాడినన్న బాలు
  •  ఇక నుండి రాయల్టీ విషయం లో లీగల్ గా ముందుకు వెళ్తామన్న బాలు

పాటలపై నిర్మాతకు, సంగీత దర్శకుడికి, గేయ రచయితలకు మాత్రమే హక్కులు వున్నాయని, అయితే రాయల్టీ చట్టం గాయనీ గాయకులకు కూడా హక్కులు కల్పిస్తుందని చెప్పారు ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. 2012లో వచ్చిన రాయల్టీ చట్టాలపై గాయనీగాయకులంతా అవగాహన కలిగి వుండాలని చెప్పిన బాలు, ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా రాయల్టీ క్రింద రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీ చట్టం ప్రకారం పాట లాభాల్లో గాయనీ గాయకులకు వాటా చెల్లించాలన్న బాలు తన పాటలకు రాయల్టీ చెల్లిస్తే ఎప్పుడో రిటైర్ అయ్యేవాడినని చమత్కరించారు.

 ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌(ఇశ్రా) సమావేశంలో  రాయల్టీ  ఈ చట్టంపై చర్చించారు. గాయనీ గాయకులంతా ఐక్యమై రాయల్టీని తీసుకోవాలని కోరారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందన్నారు . ఒక పాటను రీ-మిక్స్ చేయాలంటే ఐపీఆర్‌ఎస్‌ నుంచి పర్మిషన్‌ తీసుకోని చేయాలని, కానీ అలా జరగటం లేదన్నారు.

ఇక నుండి పాటల విషయంలో రాయల్టీ యాక్ట్ ప్రకారం లీగల్‌గా ముందుకెళ్తామని పేర్కొన్నారు. మైనెస్ 1 ట్రాక్ పాడినా.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని అయితే, ఇందుకు సదరు సింగర్‌ కుటుంబ సభ్యులు ఇశ్రాలో సభ్యులు అయి ఉండాలని చెప్పారు. కేవలం లతా మంగేష్కర్‌ మాత్రమే పాట ఒప్పందంలో రాయల్టీ వచ్చేలా కాంట్రాక్ట్ చేసుకునేవారని వివరించారు. ప్రస్తుతం రాయల్టీ యాక్టు కాపీ రైట్ యాక్టులా తయారైందని  చెప్పిన బాలు దాదాపు 410 మంది సింగర్‌లు ఇశ్రాలో ఉన్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News