karunanidhi: లిఫ్ట్ బాయ్ లేకపోతే మెట్లెక్కి వెళ్లిపోయిన కరుణానిధి!
- అవసరం అయితే ఆదివారమూ పనిచేసేవారు
- అధికారులు సైతం ఆదివారం కూడా వచ్చేవారు
- లిఫ్ట్ బాయ్ లేకపోతే మెట్లెక్కి వెళ్లిన కరుణ
ద్రవిడ రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు.. తమిళ రాజకీయాలను శాసించిన ధీరుడు, తమిళ సూరీడు అయిన కరుణానిధి నిబద్ధత కలిగిన నాయకుడు. వారంతో సంబంధం లేకుండా పని చేసిన ముఖ్యమంత్రి ఆయన. ఆదివారం అయినా సరే ఆయన పనిలో నిమగ్నమై అధికారులను సైతం పనిలో నిమగ్నం చేసేవారు.. ఆయన కార్య దీక్ష, పని చేసే సంస్కృతిపై అప్పట్లో అందరూ చర్చించుకునే వారు. ఆయన బాటలో నడవటం ఒకింత అధికారులకు కష్టమే అయినా సరే కచ్చితంగా పని చేసేవారు.
కరుణానిధి అధికారంలో వుంటే ఆదివారం అయినాసరే పనివుంటే సచివాలయానికి వెళ్లేవారు. దాంతో అధికారులు సైతం సచివాలయంలో ఆదివారం కూడా పనిచేసేవారు. కరుణానిధి పని సంస్కృతి గురించి చెప్పాలంటే ఒక సంఘటన చెప్పుకోవాలి.
1999లో పుళల్ జలాశయం గట్టు తెగే పరిస్థితి వుందని తెలిసి సీఎంగా వున్న కరుణానిధి హుటాహుటిన సచివాలయానికి బయలు దేరారు. ఉన్నతాధికారులకు సైతం త్వరగా రమ్మని కబురుపెట్టిన ఆయన మెరుపు వేగంతో సచివాలయానికి చేరుకున్నారు. తెల్లవారుజామున అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ కూడా లేకపోవటంతో హడావిడిలో రెండేసి మెట్ల చొప్పున ఎక్కి కరుణానిధి పైన ఫ్లోర్ లో వున్న తన ఛాంబర్ కు చేరుకున్నారంటే పని విషయంలో ఆయన నిబద్ధత అర్థం చేసుకోవచ్చు.