: యూపీఏ-2లో పడిన మంత్రుల వికెట్లు ఇవే
కేంద్రంలోని యూపీఏ సర్కారు రెండోసారి పాలనలో తాజాగా రైల్వే మంత్రి బన్సల్, న్యాయమంత్రి అశ్వని కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదిక వివరాలను కోరడమే కాకుండా మార్పులు సూచించినందుకు అశ్వని కుమార్, మేనల్లుడి లంచం వ్యవహారంలో బన్సల్ అవుటయ్యారు. అంతకుముందు 2జి స్పెక్ట్రం కుంభకోణంలో టెలికాం కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత భాగస్వామ్య పక్షం డిఎంకెకు చెందిన రాజా 2010 నవంబర్ 14న టెలికమ్యూనికేషన్ల మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక దయానిధి మారన్ ఎయిర్ సెల్ కంపెనీ మలేసియాకు చెందిన మాక్సిక్ కు విక్రయించాలని ఒత్తిడి తెచ్చిన వ్యవహారంలో 2011 జూలైలో టెక్స్ టైల్స్ మంత్రి పదవి నుంచి వైదొలిగారు.
ఇక ప్రియురాలు( ప్రస్తుతం భార్య) సునంద పుష్కర్ కు కోచి టీమ్ యజమాని సంస్థ రెండెజ్ స్పోర్ట్స్ వరల్డ్ లో వాటాలున్నాయన్న ఆరోపణలు రావడంతో శశిథరూర్ 2010 ఏప్రిల్ లో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఆ వ్యవహారం సద్దుమణిగాక మళ్లీ కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి పదవి పుచ్చుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వీరభద్ర సింగ్ అంతకు ముందు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనపై, ఆయన భార్యపై హిమాచల్ ప్రదేశ్ లో ఒక కోర్టు అవినీతి కేసులో అభియోగాలను నమోదు చేయడంతో రాజీనామా చేశారు.