Karunanidhi: కరుణానిధి వారసుడిగా చిన్నకుమారుడు.. స్టాలిన్‌కే డీఎంకే పగ్గాలు!

  • పార్టీలో ఎదురులేని స్టాలిన్
  • ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్నీ స్టాలిన్ కనుసన్నల్లోనే
  • ఆయన ఎన్నిక లాంఛనమే

రాజకీయ మేరు నగధీరుడు కరుణానిధి మృతితో డీఎంకేలో ఓ శకం ముగిసింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో 50 ఏళ్లకుపైగా డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగిన కరుణానిధి అస్తమయంతో ఇప్పుడాయన వారసుడు ఎవరన్నచర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. డీఎంకే పగ్గాలను ఆయన చేపట్టడం లాంఛనమే అని చెబుతున్నారు. పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడం, పార్టీలో ఆయనను ఢీకొనే నేతలు మరెవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఈజీయేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కరుణానిధికి చిన్నకుమారుడు స్టాలిన్ అంటే విపరీతమైన ప్రేమ. స్టాలిన్‌ను రాజకీయాల్లోకి తెచ్చే క్రమంలో 1994లో డీఎంకేలో చీలిక ఏర్పడింది. ఆ సమయంలో పార్టీ సీనియర్‌గా ఉన్న వైగో ఎండీఎంకేను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య చిహ్నం విషయంలో వివాదం కూడా ఏర్పడింది. చివరికి డీఎంకేకే అది దక్కింది. ఆ తర్వాతి నుంచి పార్టీలో క్రమంగా స్టాలిన్ ప్రాధాన్యాన్ని పెంచుతూ పోయిన కరుణ ఆయన కీలక నేతగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పెద్ద కుమారుడు అళగిరి కూడా తండ్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

2006 ఎన్నికల తర్వాత స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడం ద్వారా అతనికి తానెంత ప్రాధాన్యం ఇస్తున్నదీ పార్టీ శ్రేణులకు చెప్పకనే చెప్పారు. పెద్ద కుమారుడు అళగిరికి దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాల కార్యదర్శి పదవి ఇచ్చారు. అన్నదమ్ముల మధ్య పోటీ పెరుగుతున్న క్రమంలోనూ కరుణ స్టాలిన్‌కే తన మద్దతు ప్రకటించారు.

2009 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన అళగిరిని కేంద్రమంత్రిని చేసి, ఇక్కడ స్టాలిన్‌ను పార్టీలో అందలం ఎక్కించారు. గత ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అళగిరిపై బహిష్కరణ వేటు వేయించారు. ఆ తర్వాత వయోభారం కారణంగా ఇంటికే పరిమితమైన కరుణ పూర్తి బాధ్యతలను స్టాలిన్‌కు అప్పగించారు. దీంతో డీఎంకే చీఫ్‌గా ఆయన ఎన్నిక లాంఛనమేనని చెబుతున్నారు.

Karunanidhi
Stalin
DMK
Tamilnadu
  • Loading...

More Telugu News