Chandrababu: అవయవ దానం చేసేందుకు నేనూ సిద్ధమే: సీఎం చంద్రబాబు
- అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతాం
- డ్రైవింగ్ లైసెన్స్ లో ఒక షరతుగా ఉండేలా పరిశీలిస్తాం
- అవయవ దానం చేసేందుకు ముందు కొచ్చిన ప్రజలు
అవయవదానం చేసేందుకు తాను కూడా సిద్ధమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి ప్రజావేదిక హాల్ లో చంద్రబాబు అధ్యక్షతన అవయవదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అవయవదానం చేసేందుకు తాను కూడా ముందుకొస్తున్నానని అన్నారు. అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని, డ్రైవింగ్ లైసెన్స్ లో అవయవదానం ఒక షరతుగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
కాగా, చంద్రబాబు ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా లక్షా ఇరవై వేల మంది అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు వారు ఇచ్చిన పత్రాలను చంద్రబాబు సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు మెప్మా అందజేసింది. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద ఓ కార్యక్రమం నిర్వహించింది. ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఈ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు.