America: స్వదేశానికి వెళ్లిపోవాలంటూ కాలిఫోర్నియాలో సిక్కు వ్యక్తిని చావబాదిన అమెరికన్లు!
- రాడ్డుతో తలపై బాదిన దుండగులు
- తలపాగా ఉండడంతో బతికిపోయిన బాధితుడు
- తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు
అమెరికాలో జాతి వివక్ష మరోమారు పడగవిప్పింది. సిక్కు వ్యక్తిపై దుండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటన అమెరికాలోని సిక్కులను మరోమారు భయభ్రాంతులకు గురిచేసింది. 50 ఏళ్ల సిక్కు వ్యక్తిపై ఇద్దరు అమెరికన్లు పలుమార్లు దాడిచేసి చావబాదారు. దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఇక్కడికి నిన్నెవరూ రమ్మనలేదు. మర్యాదగా దేశం విడిచి వెళ్లిపోతే మంచిది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. ఈ జాతి వివక్ష దాడిపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గతవారం జరగ్గా తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను జాతి వివక్ష దాడిగానే పరిగణిస్తున్నట్టు స్టానిస్‌లాస్ కౌంటీ షరీఫ్ ఆడం క్రిస్టియన్‌సన్ తెలిపారు.
కీస్ శివారు ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, బాధితుడి తలపై నిందితులు రాడ్డుతో దాడి చేశారని క్రిస్టియన్‌సన్ తెలిపారు. అయితే, తలకు పాగా ఉండడంతో అదృష్టవశాత్తు పెను ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి వెంటనే చికిత్స అందించినట్టు చెప్పారు.