GST: ప్రజలకు మోదీ వరం... నగదు రహిత చెల్లింపులపై 20 శాతం జీఎస్టీ క్యాష్ బ్యాక్!
- గరిష్ఠంగా రూ. 100 వరకూ క్యాష్ బ్యాక్
- పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయం
- వెల్లడించిన ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్
నగదు చెల్లించకుండా రూపే కార్డు, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపితే, 20 శాతం జీఎస్టీ క్యాష్ బ్యాక్ ఇవ్వాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా యూపీఐ వ్యవస్థలను, గ్రామాల్లో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ను పెంచాలని భావిస్తున్నట్టు నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
గరిష్ఠంగా రూ. 100 వరకూ జీఎస్టీ క్యాష్ బ్యాక్ ఉంటుందని, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. ఇప్పటికే బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోదీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం క్యాష్ బ్యాక్ పాలసీపై అధ్యయనం చేసి, రిపోర్టును అందించిందని చెప్పారు. ఇక ఈ విధానంలో ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? అని అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని గోయల్ తెలిపారు.
భవిష్యత్తులో జీఎస్టీ శ్లాబ్ లు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాలుగా నాలుగు శ్లాబులుండగా, భవిష్యత్తులో దీన్ని మూడు శ్లాబులుగా చేసే అవకాశాలు ఉన్నాయని, 12, 18 శాతం శ్లాబ్ లను విలీనం చేసి 15 శాతం శ్లాబ్ గా మార్చవచ్చని ఆయన తెలిపారు.