hey ram: అమ్మో..‘ హే రామ్’ లాంటి సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేను!: కమలహాసన్
- సినిమా తీసినా విడుదల అసాధ్యమని వ్యాఖ్య
- హేరామ్ లో తన ఆలోచనలు చెప్పానని వెల్లడి
- కొచ్చిలో విశ్వరూపం-2 ప్రచారంలో పాల్గొన్న కమల్
దేశంలో ప్రస్తుతం విమర్శలను ఓర్చుకోలేని అసహన పరిస్థితులు నెలకొని ఉన్నాయని ప్రముఖ నటుడు కమలహాసన్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘హే రామ్‘ వంటి సినిమాను తీయలేనని, ఒకవేళ తీసినా దాన్ని రిలీజ్ చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ నెల 10న విడుదల కానున్న తన సినిమా విశ్వరూపం-2 ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కమల్ కొచ్చిలో విలేకరులతో ముచ్చటించారు.
2000లో తాను దర్శకత్వం వహించి నిర్మించిన హే రామ్ చిత్రంలో తన రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనల్ని స్పష్టంగా చెప్పానని కమల్ అన్నారు. తాను చేసే ప్రతి సినిమాపై ఈ ప్రభావం ఉంటుందని కమల్ స్పష్టం చేశారు. వామపక్ష పాలనలోని కేరళలో కూడా అసహన రాజకీయాలు చోటుచేసుకుంటూ ఉండటంపై కమల్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ విభజన, ఆ తర్వాత నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీని హత్యచేయడం వంటి ఘటనల సమాహారంగా హే రామ్ సినిమాలో కమల్ నటించడంతో పాటు దానికి నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. హే రామ్ చిత్రానికి కమల్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకోగా, మరో మూడు జాతీయస్థాయి అవార్డులు ఈ చిత్ర బృందాన్ని వరించాయి.