Jagan: 11కి పెరిగిన క్వారీ మృతుల సంఖ్య... మరో ఐదుగురి పరిస్థితి విషమం!

  • ఐదుగురి పరిస్థితి విషమం
  • శ్రీనివాస సుహాస్ కంపెనీ గనుల్లో ప్రమాదం
  • మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న జగన్

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగళ్ లోని కంకర మైనింగ్ క్వారీలో గత రాత్రి జరిగిన భారీ పేలుడులో మృతిచెందిన వారి సంఖ్య 11కు పెరిగింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. శ్రీనివాస సుహాస్ కంపెనీకి చెందిన క్వారీ గనుల్లో రాళ్ల మధ్య జిలెటిన్ స్టిక్స్ తో పాటు కెమికల్స్ కూడా వాడినందునే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.

 క్వారీలో మంటలు చెలరేగి, అక్కడి రెండు షెడ్లు, ఒక లారీ, మూడు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయంటే, ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఘటన తరువాత క్వారీ యజమానులు పరార్ అయ్యారని, వారి కోసం వెతుకుతున్నామని అన్నారు.

కాగా, క్వారీ పేలుడు ఘటన తనను కలచి వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసిన ఆయన, ఘటన వెనుక ఎవరున్నా చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

  • Loading...

More Telugu News