Vijay Sai Reddy: రాజ్యసభలో రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి
- ‘భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం’ పదాన్ని తొలగించాలి
- క్రిమినల్ లా లోని 497 సెక్షన్ ను సవరించాలి
- సభను అడ్డుకునే వారికి జీతభత్యాలు ఇవ్వకూడదు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లోని క్లాజ్ 3, 4లో ఉన్న ‘భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం’ పదాన్ని తొలగించాలని కోరుతూ ఓ ప్రైవేటు బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.
‘భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం’ అనే పదం కారణంగా ఆర్టికల్ 19 కింద పౌరులకు కల్పించిన ప్రాథమికహక్కులు పరిమితం అవుతున్నాయని, అందుకే, సవరణ కోరినట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. క్రిమినల్ లా లోని 497 సెక్షన్ సవరణకు సంబంధించి రెండో బిల్లును ప్రవేశపెట్టారు. వైవాహిక బంధం చాలా పవిత్రమైందని, దీనిని కాపాడేందుకు లింగ వివక్ష లేకుండా మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
సభను అడ్డుకునే వారికి జీతభత్యాలు ఇవ్వకూడదు
ఈ సందర్భంగా రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, చిన్న పార్టీలకు చెందిన ఎంపీలు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వడం లేదని, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరికీ మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకునే వారికి జీతభత్యాలు ఇవ్వకూడదని, అంతరాయం కలిగిన సభా సమయానికి నష్టపరిహారంగా అంతే సమయాన్ని పొడిగించాలని, పార్లమెంట్ ను ఏడాదికి 120 రోజులు నడపాలని సూచించారు.