Chandrababu: నాడు బీజేపీ మాటలు చెప్పింది..ఇప్పుడు మాయమాటలు చెబుతోంది: సీఎం చంద్రబాబు

  • ఏపీకి కేంద్రం అన్యాయం, మోసం చేస్తోంది
  • వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి పారిపోయారు
  • పవన్ కల్యాణ్  తన రూటే మార్చేశాడు

నాడు ఎన్నికలప్పుడు బీజేపీ మాటలు చెప్పిందని, ఇప్పుడు మాయమాటలు చెబుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లా తాతకుంట్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి కేంద్రం అన్యాయం, మోసం చేస్తోందని, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని, టీడీపీ ఎంపీలు తెలుగుజాతి శక్తి ఏంటో తెలిసేలా ఢిల్లీని గడగడ లాడించారని అన్నారు. ఒక రాష్ట్రం కోసం అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత టీడీపీదైతే, ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత విజయవాడ ఎంపీ కేశినేని నానికి దక్కిందని అన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి పారిపోయారని అన్నారు. కేంద్రాన్ని నిలదీస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నారని, జగన్ చేసే వ్యాఖ్యలు పద్ధతిగా ఉండవని, పసలేని విమర్శలు చేస్తారని అన్నారు. ప్రతి వారం కోర్టుకు హాజరై బయటికి వచ్చే జగన్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

పవన్ కల్యాణ్ అయితే తన మాట మార్చేశాడని, తన రూటే మార్చేశాడని, తమపైనే విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఏపీకి కేంద్రం నుంచి 75 వేల కోట్ల రూపాయలు రావాలని జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెబితే, దీని గురించి ఒక మాట కూడా పవన్ మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీలో సింగపూర్ తరహా పరిపాలన కావాలని నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. సింగపూర్ ప్రభుత్వం మన దేశంలో ఎవరినైనా నమ్మిందంటే అది ఏపీనే అని, మనకు పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు.  

  • Loading...

More Telugu News