MULK: నా సినిమాను పైరసీలో చూసినా సంతోషమే.. ముల్క్ దర్శకుడు అనుభవ్ సిన్హా!

  • పైరసీలోచూడాలని పాక్ ప్రజలకు సూచన
  • అక్కడ సినిమాపై నిషేధం నేపథ్యంలో విజ్ఞప్తి
  • తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకున్న ముల్క్

సాధారణంగా ఏ సినిమా దర్శకుడైనా ‘మా సినిమాను థియేటర్ లోనే చూడండి. పైరసీని అరికట్టండి. ఇండస్ట్రీని కాపాడండి’ అని ప్రేక్షకులను కోరతారు. కానీ ఈ రోజు విడుదలైన ‘ముల్క్’ సినిమా దర్శకుడు అనుభవ్ సిన్హా మాత్రం కాస్త డిఫరెంట్. తన మూవీని థియేటర్ లో చూడటం కుదరకుంటే కనీసం పైరసీలో అయినా చూడాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పైరసీలో సినిమా చూడాలని సిన్హా కోరుతున్నది మాత్రం భారతీయుల్ని కాదు, పాకిస్తాన్ ప్రజలను.

ఎందుకంటే ముల్క్ చిత్రంపై పాకిస్తాన్ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. దీంతో నా ప్రియమైన పాక్ ప్రజలకు.. అంటూ అనుభవ్ సిన్హా ఓ లేఖను విడుదల చేశారు. అందులో.. ‘నేను తీసిన ముల్క్ అనే సినిమాపై మీ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. మీరంతా చట్టబద్ధంగా ఈ సినిమాను చూడాలని నాకూ ఉంది. కానీ ఒకవేళ కుదరకుంటే పైరసీలో అయినా చూడండి. సినిమా చూశాక పాక్ సెన్సార్ బోర్డు ఎందుకు మా చిత్రాన్ని నిషేధించిందో చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్ని మీరు చూడకూడదనే పాక్ సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది’ అని లేఖలో సిన్హా పేర్కొన్నారు.

రిషీ కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణాలు ప్రధాన పాత్రల్లో నటించిన ముల్క్ ఈ రోజు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఉగ్రవాద అభియోగాలు ఎదుర్కొంటున్న కుటుంబ పెద్దగా రిషీ కపూర్, ఆయన తరఫున వాదించే లాయర్ గా తాప్సీ నటించారు. బనారస్ మీడియా వర్క్స్, సోహమ్ రాక్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

  • Loading...

More Telugu News