East Godavari District: పాము మరణం తరువాత దుర్గాడలో ఉద్రిక్తత... స్థానికేతరులను బయటకు పంపిన అధికారులు!
- నిన్న మరణించిన దుర్గాడ పాము
- గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు
- మరణానికి టీవీ చానల్స్ కూడా కారణమంటున్న ప్రజలు
26 రోజుల పాటు తమతో పూజలందుకుని, తామంతా దైవంగా భావిస్తున్న పాము మరణించడాన్ని దుర్గాడ ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. నిన్న పాము చనిపోయిన తరువాత నుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాము మరణానికి ఓ ఎస్ఐ కారణమని గ్రామస్తులు ఆరోపించడంతో, ఆయన్ను విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరూపంగా తాము భావిస్తున్న పాము మరణానికి కొన్ని టీవీ చానళ్ల అతి వార్తలు కూడా కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎక్కువగా ప్రచారం చేయడం వల్లే అధికారులు వచ్చి పామును తరలించాలని చూశారని, తమ గ్రామాన్ని వీడటం ఇష్టంలేని దైవం ఇక్కడే ప్రాణాలు వదిలిందని మరికొందరు వ్యాఖ్యానించారు.
కాగా, గ్రామంలో పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో స్థానికేతరులను అధికారులు బయటకు పంపిస్తున్నారు. ఈ ఉదయం నుంచి టీవీ చానల్స్ ను పాము తిరుగాడిన ప్రాంతానికి వెళ్లనీయకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుస్తోంది. పాము అంత్యక్రియలను పూర్తి చేసిన తరువాత, తామే స్వయంగా గుడిని నిర్మించుకుంటామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.