Shekhar Kammula: డబ్బిస్తానే తప్ప, ఎన్నడూ తీసుకోను... నా పేరు చెబితే మోసపోవద్దు: డైరెక్టర్ శేఖర్ కమ్ముల
- శేఖర్ కమ్ముల పేరు చెప్పి డబ్బు గుంజిన సంజయ్
- శేఖర్ దృష్టికి తీసుకొచ్చిన ఒంగోలు స్టూడెంట్
- వారం రోజుల్లోనే నిందితుడి అరెస్ట్
- పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన శేఖర్ కమ్ముల
తన సినిమాల్లో నటించే నటీ నటులకు తాను డబ్బిస్తానే తప్ప, అవకాశాల పేరు చెప్పి, వారి నుంచి ఎటువంటి డబ్బూ తీసుకోబోనని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సంజయ్ అనే వ్యక్తి, శేఖర్ కమ్ములకు తాను అసిస్టెంట్ నని, కాస్టింగ్ డైరెక్టర్ నని చెప్పుకుని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేయగా, విషయం తనకు తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని శేఖర్ వెల్లడించాడు.
ఒంగోలుకి చెందిన ప్రదీప్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈ దందాను తన కార్యాలయానికి వచ్చి వివరించాడని చెప్పారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. "సంజయ్ అనే నకిలీ వ్యక్తి, నా అసిస్టెంట్ / కాస్టింగ్ డైరెక్టర్ అంటూ నటులు కావాలని క్వికర్ లో యాడ్ ఇచ్చి, డబ్బులు వసూలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. బాధితుల్లో ఒకరైన ఒంగోలుకి చెందిన ప్రదీప్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మా ఆఫీస్ కి వచ్చి, ఈ విషయాన్ని మాకు తెలియజేశాడు.
నేను వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను. ఒక వారంలోనే ఈ మోసగాడిని సైబర్ పోలీసులు పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ డీసీపీ కేసీఎస్ రఘువీర్ గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.రమేష్ గారికి, ఈ టీమ్ లో పని చేసిన ఎస్ఐ నరేష్, వెంకటేశం, ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు మహేశ్వర రెడ్డి , ఫిరోజ్, శ్యామ్, హరిలకు ధన్యవాదాలు.
నేను ఎప్పుడూ కూడా కాస్టింగ్ డైరెక్టర్ ని నియమించుకోలేదు. ఎవరైనా నా సినిమాలో పాత్రకి సరిపోతారు అనిపిస్తే, వాళ్ళని మా డైరెక్షన్ టీమ్ కాంటాక్ట్ చేస్తుంది. నా సినిమాలో నటించేందుకు కానీ, నా సినిమాకి పని చేసేందుకు గానీ ఎప్పుడూ ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోము. మాతో పని చేసిన వాళ్ళకి మేమే డబ్బు చెల్లిస్తాం. దయచేసి ఇటువంటి ప్రకటనలు చూసే మోసపోకండి" అని పోస్టు పెట్టారు.