Apple: ప్రపంచంలోనే తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించిన యాపిల్
- రెండు రోజుల వ్యవధిలో 9 శాతం పెరిగిన ఈక్విటీ
- ఈక్విటీ విలువ 207 డాలర్లకు చేరడంతో అరుదైన ఫీట్
- లిస్టింగ్ నాటితో పోలిస్తే 50 వేల రెట్లు పెరిగిన యాపిల్ విలువ
ప్రపంచంలో తొలి లక్ష కోట్ల డాలర్ల విలువను (సుమారు రూ. 68.60 లక్షల కోట్లు) అందుకున్న పబ్లిక్ కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర యాక్సెసరీస్ ను మార్కెటింగ్ చేస్తున్న యాపిల్ ఈక్విటీ విలువ గురువారం నాటి యూఎస్ ట్రేడింగ్ లో 207 డాలర్లకు (సుమారు రూ. 14,207) చేరడంతో యాపిల్ ఈ ఫీట్ ను అందుకుంది. కాగా, గడచిన మంగళవారం నుంచి యాపిల్ విలువ 9 శాతానికి పైగా పెరగడం గమనార్హం. 1980లో తొలిసారిగా యూఎస్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన యాపిల్, నాటి ధరతో పోలిస్తే, ఇప్పటివరకూ 50 వేల శాతానికి పైగా పెరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో సంస్థ అంచనాలకు మించి లాభాలను నమోదు చేయడంతో ఇటీవలి కాలంలో యాపిల్ ఈక్విటీ విలువ మంచి దూకుడు చూపించింది.
2001లో 6 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న యాపిల్ మార్కెట్ కాప్, ఐఫోన్ ను పరిచయం చేసిన తరువాత ఆకాశానికి ఎగిసింది. జూన్ 2007లో 100 బిలియన్ డాలర్ల మార్క్ ను దాటిన యాపిల్ 2010 - 2011 మధ్య 174 బిలియన్ డాలర్ల నుంచి 624 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. ఆపై 2014లో 603 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంస్థ విలువ, గత సంవత్సరం సెప్టెంబర్ లో 796 బిలియన్ డాలర్లకు పెరిగి, ఇప్పుడు 1000 బిలియన్ (ట్రిలియన్) డాలర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ టిమ్ కుక్ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.