: ఆ హార్మోన్ జతచేస్తే.. వయసు పెరిగినా గుండె ఓకే!
వయసు పెరగడంతో పాటుగా మనిషిలో గుండె పనితీరు ఎందుకు సన్నగిల్లుతూ వస్తుంది? అంటే.. వయసుతో పాటు శరీరంలో తగ్గిపోయే హార్మోన్లు ఏవో గుండె పనితీరుకు అత్యావశ్యకాలు అయి ఉంటాయనేది సింపుల్ లాజిక్. మన రక్తంలో అలాంటి హార్మోన్ ఏదో గుర్తించి.. వయసు పెరిగిన తర్వాత.. ఆ హార్మోన్‌ను కొత్తగా ప్రవేశపెడితే .. సమస్య తీరిపోతుంది కదా.. ! సరిగ్గా ఇదే లాజిక్‌ను అనుసరించారు.. అమెరికాలోని శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ముసలి ఎలుకలోని గుండె వైఫల్య లక్షణాలను వెనక్కు మళ్లించారు.
ముసలితనం వచ్చే కొద్దీ శరీర అవసరాలకు తగినట్లుగా రక్తాన్ని పంప్ చేయడం గుండెకు కష్టం అయిపోతుంది. ఇందువల్లే ఆయాసం, నిస్సత్తువ వస్తుంటాయి. దీనిపై పరిశోధనలు చేసిన హార్వర్డ్ స్టెంసెల్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ముసలి ఎలుకకు, యువ ఎలుక రక్త ప్రసరణ వ్యవస్థను జోడించారు. ముసలి ఎలుక గుండె పనితీరు మెరుగుపడింది. మరింత లోతుగా పరిశోధించినప్పుడు.. ముసలితనంలో జీడీఎఫ్ 11 అనే హార్మోన్ తగ్గడం వల్లనే సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్‌ను ముసలి ఎలుకల్లో విడిగా ప్రవేశపెట్టారు. గుండె కండరాలు మామూలుగా పనిచేయసాగాయి. దాంతో రక్తంలో ఈ హార్మోన్ భర్తీ వల్ల.. గుండె పనితీరు పెరుగుతుందని తేలినట్లు శాస్త్రవేత్తల్లో ఒకరైన వాగర్స్ చెప్పారు. ఈ పరిశోధనల్లో పురోగమనం.. మనుషుల్లో గుండె చికిత్సలకు దారితీస్తుందని వారు ఆశిస్తున్నారు.