Madhya Pradesh: కాంగ్రెస్‌కు షాకిచ్చిన సొంత పత్రిక.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుపు ఖాయమన్న ‘స్పిక్’ సర్వే.. ప్రచురించిన ‘నేషనల్ హెరాల్డ్’!
- మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే అధికారం
- కాంగ్రెస్-బీఎస్పీ కలవకుంటే బీజేపీకి 147 సీట్లు
- కలిసినా బీజేపీపై ప్రభావం నిల్
కాంగ్రెస్‌కు సొంత పత్రికే షాకిచ్చింది. స్పిక్ మీడియా నెట్‌వర్క్ చేసిన ప్రీపోల్ సర్వేను ‘నేషనల్ హెరాల్డ్’ ప్రచురించింది. స్పిక్ మీడియా సర్వేలో మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం ఖాయమని తేలింది. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 147 స్థానాలను సొంతం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడైనట్టు తెలిపింది. అయితే, ఇది కాంగ్రెస్, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తే వచ్చే ఫలితాలని పేర్కొంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కనుక బీజేపీ 126 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. రాఫెల్ డీల్‌ను బోఫోర్స్‌తో పోల్చిన మరునాడే నేషనల్ హెరాల్డ్‌లో స్పిక్ సర్వే ఫలితాలను ప్రచురించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిస్తే కనుక బీజేపీ 126 సీట్లకే పరిమితమవుతుందని, కాంగ్రెస్-బీఎస్పీ కూటమి 103 సీట్లు గెలుచుకుంటుందని సర్వే తేల్చి చెప్పింది. ఒకవేళ కాంగ్రెస్-బీఎస్పీ కూటమి కట్టకుంటే బీజేపీ 147 స్థానాలో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్‌కు 73 స్థానాలే వస్తాయని అంచనా వేసింది.
మరోవైపు, మోదీ అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అని సర్వే పేర్కొంది. మోదీకి 41 శాతం మంది ఓటేయగా, రాహుల్ గాంధీ 9.72 శాతంతో ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచారు.