america: అమెరికాలో పాస్ పోర్ట్ పోగొట్టుకున్న యువకుడు.. వెంటనే స్పందించిన సుష్మ!
- ఈ నెలలో భారత్ లో తన వివాహం ఉందన్న రవితేజ
- తత్కాల్ పాస్ పోర్ట్ జారీలో సాయం కోసం విజ్ఞప్తి
- సాయం చేస్తానని సుష్మ హామీ
ట్విట్టర్ లో చురుగ్గా ఉండే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. విదేశాల్లో భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్పందిస్తూ ఉంటారు. బాధితులకు సాయం చేయాలని అక్కడి అధికారుల్ని ఆదేశిస్తారు. తాజాగా అమెరికాలో ఓ భారతీయ యువకుడి పట్ల వ్యవహరించిన తీరుతో సుష్మ మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.
భారత్ కు చెందిన రవితేజ అనే యువకుడు అమెరికాలో తన పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నాడు. దీంతో వెంటనే అతను ట్విట్టర్ లో ‘అమెరికాలోని వాషింగ్టన్ లో నా పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నాను. నా పెళ్లి ఈ నెల 13-15 తేదీల్లో భారత్ లో జరగబోతోంది. నేను ఇండియాకు ఈ నెల 10న రావాలి. దయచేసి నా తత్కాల్ పాస్ పోర్ట్ త్వరగా మంజూరై పెళ్లికి గడువులోగా వెళ్లేలా సాయం చేయండి’ అని సుష్మా స్వరాజ్ ను అభ్యర్ధించాడు.
దీంతో సుష్మ తొలుత ‘మీరు తగని సమయంలో పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నారు’ అంటూ హాస్య పూర్వకంగా స్పందించారు. తర్వాత చెబుతూ, ఈ విషయాన్ని తాను పరిశీలిస్తాననీ, పెళ్లి గడువులోగా భారత్ చేరుకునేలా సాయం చేస్తానని మాటిచ్చారు. రవితేజకు మానవతా దృక్పధంతో సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సుష్మ వెంటనే స్పందించడంతో ఆనందపడ్డ రవితేజ.. ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.