swedan: వర్షపు నీటితో నిండిపోయిన రైల్వే స్టేషన్.. ఈత కొట్టి ఎంజాయ్ చేసిన ప్రజలు!
- స్వీడన్ లోని ఉప్సలాలో ఘటన
- ప్రజల్ని బయటకు తెచ్చిన పోలీసులు
- నీటిని తోడేసిన అధికారులు
సాధారణంగా మనం వెళ్లాల్సిన బస్సు ఆలస్యంగా వస్తే చికాకు పడిపోతాం. ఒకవేళ మనం ఆలస్యంగా వచ్చి బస్సు ముందే వెళ్లిపోతే మనల్ని మనం తిట్టుకుంటాం. ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు మన టైం బాగోలేదని సరిపుచ్చుకుంటాం. కానీ ప్రపంచంలో జనాలందరూ ఒకేలా ఉండరు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా దాన్ని పాజిటివ్ గా తీసుకునే ప్రజలు ఉంటారు. దీన్ని నిరూపించే ఘటన యూరప్ దేశమైన స్వీడన్ లో చోటుచేసుకుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇక్కడి ఉప్సలా రైల్వేస్టేషన్ నిండిపోయింది. దీంతో రైళ్లు నిలిచిపోయాయి. ఇప్పుడెలా? అని చాలామంది ప్రయాణికులు తలలు పట్టుకుంటే, కొందరు మాత్రం హాయిగా ఆ నీటిలో ఈత కొట్టడం మొదలుపెట్టారు. మరికొందరు ఈత కొట్టే దుస్తులు, ఇతర ఉపకరణాలతో నీళ్లలో దిగి ఎంజాయ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. చివరికి సెక్యూరిటీ గార్డులు వీరిని బయటకు తీసుకొచ్చారు. విద్యుత్ వైర్లు నీటిలో మునిగిన కారణంగా విద్యుత్ షాక్ కొట్టే అవకాశం ఉండటంతో అధికారులు ఇంకెవ్వరినీ లోనికి అనుమతించలేదు. చివరికి నీటినంతా తోడేసి పరిస్థితిని మామూలు స్థితికి తీసుకొచ్చారు.