Telangana: బాలికలు త్వరగా ఎదిగేందుకు హార్మోన్ ఇంజక్షన్లు.. ఆపై వ్యభిచారం: యాదగిరిగుట్టలో జరుగుతున్నది ఇదే!

  • పిల్లలను తీసుకొచ్చి వెట్టిచాకిరీ
  • ఆపై హార్మోన్ ఇంజక్షన్లు
  • ఎదిగాక లక్ష చొప్పున విక్రయం

యాదగిరిగుట్ట కేంద్రంగా జరుగుతున్న వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించి సరికొత్త విషయం వెలుగులోకి వచ్చి విస్మయపరుస్తోంది. గుట్టలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు రాచకొండ పోలీసులు జూలై 1 నుంచి ‘ఆపరేషన్ మస్కాన్’ ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పట్టణంలోని వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఓ వ్యభిచార గృహం వద్ద ఉన్న బాలికను అనుమానించి ప్రశ్నించడంతో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి. విచారణలో వెల్లడైన విషయాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ రామచంద్రారెడ్డి, ఏసీపీ శ్రీనివాసాచార్యులు కలిసి మీడియాకు తెలియజేశారు.

 దూరప్రాంతాల నుంచి బాలికలను ఎత్తుకొచ్చి, వారు త్వరగా ఎదిగేందుకు హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం, ఎదిగిన తర్వాత వారిని వ్యభిచారంలోకి దింపడం చేస్తున్నట్టు తెలిపారు. స్థానికంగా నివసించే కంసాని శంకర్, కంసాని యాదగిరి అనే వ్యక్తులు బాలికలను ఎత్తుకొచ్చి వ్యభిచార గృహలకు లక్ష రూపాయలు తీసుకుని విక్రయిస్తారని వ్యభిచార గృహాల నిర్వాహకులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కంసాని శంకర్ ఇప్పటికే చనిపోగా, యాదిగిర ప్రస్తుతం నల్గొండ జైలులో ఉన్నట్టు పేర్కొన్నారు. బాలికలను తొలుత తమ పిల్లలుగానే చెబుతూ స్కూలుకు పంపుతారని, కొందరిని ఇంటి పనులకు పెడతారని పోలీసులు వివరించారు.

బాలికలు త్వరగా ఎదిగేందుకు స్వామి అనే వైద్యుడికి  రూ.25 వేలు చెల్లించి హార్మోన్ ఇంజక్షన్లు ఇప్పిస్తారు. దీంతో అమ్మాయిల్లో త్వరగా ఎదుగుదల కనిపిస్తుంది. అనంతరం వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు. తాజాగా వ్యభిచార గృహాల నుంచి 11 మంది బాలికలను రక్షించిన పోలీసులు వారిని తుక్కుగూడలోని ప్రజ్వల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వివిధ నేరాలకు పాల్పడిన అభియోగాలపై 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News