Chandrababu: కేంద్రం పరిధిలో ఉంటే వైసీపీ స్పందించదా? : సీఎం చంద్రబాబు

  • వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోంది
  • కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలన్న జగన్ మాటమార్చారు
  • బీసీలకు నష్టం జరగకుండా కాపు రిజర్వేషన్లు ఇస్తాం  

విశాఖపట్టణం జిల్లా ఎస్.రాయవరం మండలంలోని గుడివాడలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని, తమిళనాడు తరహాలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని మొన్నటి వరకు జగన్ అన్నారని, ఇప్పుడు, కేంద్రం పరిధిలో ఉంది సాధ్యం కాదని అంటున్నారని విమర్శించారు. కేంద్రం పరిధిలో ఉంటే వైసీపీ స్పందించదా? అని ఆయన ప్రశ్నించారు. బీసీలు తెలుగుదేశానికి వెన్నెముకలాంటివారని, వారికి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 19 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ఎస్టీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. అన్న క్యాంటీన్ల గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ.. పేదవారికి గౌరవంగా భోజనం పెట్టాలనే ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేశామని, దేశంలో ఎక్కడా ఈ తరహా క్యాంటీన్లు లేవని చెప్పారు. భవిష్యత్ లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు.

విభజన హామీల అమలు విషయంలో మొండి చేయి చూపించారని, ప్రజలకు న్యాయం జరగాలనే కేంద్ర ప్రభుత్వంతో విభేదించానని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా అన్ని విధాలా అవసరమని, కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ‘హోదా’ సాధించి తీరుతామని, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ వచ్చి తీరుతుందని, పోలవరం ఎడమ కాల్వను పూర్తి చేసి విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని చెప్పారు. భావితరాల భవిష్యత్ కోసమే కేంద్రంతో పోరాడుతున్నామని, రాష్ట్ర ప్రజలను టీడీపీ చైతన్య పరుస్తోందని చంద్రబాబు చెప్పారు.  

  • Loading...

More Telugu News