Chandrababu: చంద్రబాబుకు ఆడపిల్ల లేదుగా.. అందుకే, పట్టించుకోరు: ఎమ్మెల్యే రోజా

  • తనపై పోలీస్ కేసు నమోదవడంపై రోజా స్పందన
  • టీడీపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం
  • కొద్ది మంది పోలీస్ అధికారుల వల్లే నగరిలో శాంతి భద్రతల సమస్య 

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై పోలీస్ కేసు నమోదైంది. నగరిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రోజాపై ఈ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘టీడీపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం. ముఖ్యంగా.. చంద్రబాబుకు ఆడపిల్ల లేదు. కాబట్టే ఆడపిల్ల మీద గౌరవం లేదు. ఆడపిల్లకు కష్టమొచ్చినా పట్టించుకోరు. ఎన్నో ఆత్మహత్యలు, ఆడపిల్లల అక్రమరవాణా జరుగుతున్నా పట్టించుకోకుండా, నిమ్మకు నీరెత్తినట్టు చంద్రబాబు ఉండటం చూస్తుంటే మనకు అర్థమౌతుంది. తన బినామీ అయిన నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఎలా మాఫీ చేస్తోందో మనం చూస్తున్నాం.

అలాగే, డ్వాక్రా మహిళలు, తుందుర్తిలోని మహిళలు, కాల్ మనీ సెక్స్ రాకెట్ లో బలైన మహిళలు..ఉన్నారు. ఇందులో ఏ ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా? ఈరోజు నా నియోజకవర్గంలో ఓ మహిళను టిప్పర్ గుద్ది చంపేస్తే.. దానికి నేను స్పందించినందుకు.. సీఐని నిలదీసినందుకు నాపై తప్పుడు కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసం?’ అని ప్రశ్నించారు. మైనింగ్ మాఫియాను కాపాడేందుకే సీఐ,ఎస్ఐలు తనపై తప్పుడు కేసులు పెట్టారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదని రోజా స్పష్టం చేశారు. అక్రమార్కులకు అండగా ఉంటున్న కొద్ది మంది పోలీసు అధికారుల వల్లనే నగరి నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News