Jarkhand: రాంచిలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్య

  • అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య?
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు
  • గత పది రోజుల్లో జార్ఖండ్‌లో ఇది రెండో ఘటన

ఢిల్లీలోని ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనను మరువకముందే జార్ఖండ్‌లోని రాంచీలో అటువంటి ఘటనే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు.

ప్రైవేటు కంపెనీని నిర్వహిస్తున్న దీపక్ కుమార్.. తన తల్లిదండ్రులు, సోదరుడు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీపక్ సోదరులు ఇద్దరు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, మిగతా కుటుంబ సభ్యులు మంచంపై పడి ఉన్నారు. దీపక్ ఝా కుమారుడు, కుమార్తె కూడా మంచంపై చనిపోయి కనిపించారు.

దీపక్ ఝా సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించి అప్పుల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది. వారి ఆత్మహత్యలకు అదే కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దీపక్ కుమార్తె కోసం స్కూలు బస్సు వచ్చి ఆగినా ఇంటి లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఓ విద్యార్థి బస్సు దిగి తలుపు కొట్టగా అది తెరుచుకుంది. లోపల మృతదేహాలు కనిపించడంతో భయంతో పరిగెత్తుకెళ్లి ఆ విద్యార్థి డ్రైవర్‌కు చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, జార్ఖండ్‌లో గత పది రోజుల్లో ఇది రెండో సామూహిక ఆత్మహత్య ఘటన కావడం గమనార్హం. హజారీబాగ్‌లో అప్పుల బాధకు తాళలేక ఆరుగురు కుటుంబ సభ్యులు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

Jarkhand
Ranci
Mass suicide
Police
  • Loading...

More Telugu News