Kotipalli Raghava: రఘుపతి వెంకయ్య వద్ద ఆఫీసు బాయ్ గా, టంగుటూరి ప్రకాశం వద్ద క్లీనర్ గా... నిర్మాత కె.రాఘవ గురించిన విశేషాలు!

  • మరో ముద్దుబిడ్డను కోల్పోయిన టాలీవుడ్ 
  • 18వ ఏటనే సినీ రంగ ప్రవేశం చేసిన కోటిపల్లి రాఘవ
  • పాతాళ భైరవికి స్టంట్ మాస్టర్ గానూ సేవలు
  • దాసరి నారాయణరావును పరిచయం చేసిన రాఘవ

తెలుగు సినీ కళామతల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయింది. 1913 డిసెంబర్ 9న తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లిలో జన్మించిన కోటిపల్లి రాఘవ, 105 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఇటీవల ఆయన భార్య మృతి చెందగా, ఆ తరువాత మనోవేదనకు గురైన, ఆయన నేడు ప్రాణం విడిచారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ప్రశాంతి, ప్రతాప్ మోహన్ ఉన్నారు.

నిర్మాత రాఘవ మొదట్లో స్టంట్ మాస్టర్, నటుడిగానూ కూడా రాణించారు. తన 18వ ఏటనే... అంటే 1931లో సినీ రంగ ప్రవేశం చేసిన రాఘవ, తొలినాళ్లలో వచ్చిన మూకీ చిత్రాల నుంచి టాలీవుడ్ తో మమేకమయ్యారు. రఘుపతి వెంకయ్యనాయుడి వద్ద ఆఫీస్ బాయ్ గా పనిచేసిన ఆయన, ఆ తరువాత కోల్ కతా వెళ్లి ఈస్టిండియా ఫిలిం కంపెనీలో ట్రాలీ పుల్లర్ గానూ పనిచేశారు. తిరిగి చెన్నై వచ్చి టంగుటూరి ప్రకాశం వద్ద క్లీనర్ గా కొంతకాలం విధులు నిర్వహించి, ఆపై సి.పుల్లయ్య వద్ద ప్రొడక్షన్ డిపార్టుమెంట్ లో చేరారు.

 జెమినీ స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లోనూ ఆయన నటించారు. 'పాతాళ భైరవి', 'రాజు-పేద' తదితర సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. ఫల్గుణ ఫిలిమ్స్ సంస్థను స్థాపించి 'జగత్ కిలాడీలు', 'జగత్ జంత్రీలు', 'జగత్ జెట్టీలు' వంటి కొన్ని చిత్రాలు తీసి, ఆపై కుమారుడి పేరిట ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు.

దర్శకరత్న దాసరి నారాయణరావులోని ప్రతిభను గుర్తించి, ఆయన్ను దర్శకుడిగా పరిచయం చేసింది కూడా కోటిపల్లి రాఘవే. దాసరి తొలి చిత్రం 'తాతా మనవడు' చిత్రాన్ని రాఘవ నిర్మించారు. అలాగే కోడి రామకృష్ణను దర్శకుడిగా పరిచేయం చేస్తూ 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రాన్ని నిర్మించారు. ఎంతో మందిని సినీ కళామతల్లికి పరిచయం చేసిన ఆయనకు రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా లభించింది. రాఘవ మృతిపట్ల సీఎం చంద్రబాబు, వైకాపా అధినేత వైఎస్ జగన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News