imran khan: వచ్చే నెల 11న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటున్న ఇమ్రాన్‌ఖాన్!
- స్థానిక మీడియాలో కథనాలు
- పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రకటన
- ఖైబర్ పఖ్తుంఖ్వా లో పార్టీ కార్యకర్తలతో ఇమ్రాన్ భేటీ
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే నెల 11వ తేదీన పాక్ ప్రధానిగా తాను ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పీటీఐ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఈ విషయాన్ని ఇమ్రాన్ చెప్పినట్టు స్థానిక మీడియా పేర్కొంది.
చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపినట్టు సమాచారం. కాగా, ఈ నెల 25న జరిగిన పాకిస్థాన్ జాతీయ ఎన్నికలలో పీటీఐ 116 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఇమ్రాన్ ఖాన్ కు లభించకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతును కూడగడుతున్నారు. పీటీఐకి ఇప్పటికే జీడీఏ, ఎంక్యూఎం-పీ, అవామీ ముస్లిం లీగ్ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. దీంతో, పీటీఐ మెజార్టీ 122కు పెరిగింది. పాక్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇందులో 137 మంది సభ్యులు నేరుగా పార్లమెంట్ కు ఎన్నిక కావాలి.