bihar: మత్తు మందిచ్చి అత్యాచారం చేసేవారు.. పోక్సో కోర్టులో బిహార్ బాలికల వాంగ్మూలం!
- ఒప్పుకోకుంటే తీవ్రంగా హింసించేవారని వెల్లడి
- బాధ తట్టుకోలేక గాజు ముక్కలతో చేతులు కోసుకునేవాళ్లమని వాంగ్మూలం
- 34 మంది బాలికలపై అత్యాచారం జరిగినట్లు తేల్చిన వైద్యులు
బిహార్ లోని ముజఫర్ పూర్ లో ఓ అనాధాశ్రమంలో బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డ ఘటనలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న బ్రజేష్ అనే వ్యక్తి బాలికల భోజనంలో మత్తుమందులు కలిపి ఇచ్చేవాడనీ, వారు స్పృహ కోల్పోయిన తర్వాత లైంగికదాడికి పాల్పడేవాడని బాలికలు ప్రత్యేక పోక్సో కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. అలాగే తమను నగ్నంగా పడుకోవాలని ఒత్తిడి చేసేవారని, మాట వినకుంటే దారుణంగా కొట్టేవారన్నారు. ఈ రాక్షసుల నుంచి తప్పించుకోవడానికి గాజు ముక్కలతో చేతుల్ని కోసుకునే వాళ్లమని బాలికలు కోర్టుకు విన్నవించారు.
ఈ సందర్భంగా ఓ బాధితురాలు (10) వాంగ్మూలమిస్తూ..‘నా భోజనంలో మత్తు మందు కలిపేవారు. నాకు మగతగా అనిపించగానే బ్రజేష్ సార్ గదిలోకి వెళ్లి పడుకోమని అక్కడ పనిచేసే ఆంటీలు చెప్పేవారు. ఈ రోజు ఎవరో బయటి నుంచి వస్తున్నారని వాళ్లు అప్పుడు మాట్లాడుతున్నారు. తిరిగి నాకు మెలకువ వచ్చేటప్పటికీ నా ఒంటిమీద దుస్తులు ఉండేవి కావు‘ అని చెప్పింది.
మరో బాలిక స్పందిస్తూ.. మత్తు మందుల్ని తీసుకోవాల్సిందిగా బ్రజేష్, అతని సహచరులు ఒత్తిడి చేసేవారనీ, ఒప్పుకోకుంటే మర్మాంగాలను గాయపర్చేవారని కోర్టుకు తెలిపింది. తమకు లొంగని బాలికపై వీరు సలసలా కాగుతున్న నూనెను, వేడివేడి నీటిని పోసి వేధించేవారని వెల్లడించింది. ఈ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బాలికలు గాజు ముక్కలతో కాళ్లు, చేతులు కోసుకునేవారని పేర్కొంది.
బిహార్ లోని ముజఫర్ పూర్ లో సేవా సంకల్ప్ ఏవం సమితి అనే ఎన్జీవో నిర్వహిస్తున్న ఈ అనాధాశ్రమంలో మైనర్ బాలికలపై రేప్ జరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 34 మంది బాలికలపై వీరు అత్యాచారానికి పాల్పడ్డారని వైద్య పరీక్షలో తేలింది. తనకు లొంగని బాలికల్ని ఆశ్రమ నిర్వాహకుడు బ్రజేష్ చంపేసి ఆశ్రమం ప్రాంగణంలో పూడ్చిపెట్టాడని ఆరోపణలు రావడంతో ఇక్కడ తవ్వకాలు సైతం చేపట్టారు.