kalam: కలామ్ ట్విట్టర్ సమాచారాన్ని దొంగిలించారు.. బంధువుల ఆరోపణ
- సహాయకుడు శ్రీజన్ పాల్ సింగ్ మోసం చేశాడని వెల్లడి
- కలాం పేరిట డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడని మండిపాటు
- ట్విట్టర్ అకౌంట్లు తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి లేఖ
మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం ట్విట్టర్ ఖాతాలోని సమాచారం చోరీకి గురయిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. కలాంకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న శ్రీజన్ పాల్ సింగ్ ఆయన ఖాతాలోని సమాచారంతో సొంతంగా ‘కలామ్ సెంటర్’ అనే ట్విట్టర్ అకౌంట్ ను తెరిచాడని వెల్లడించారు. కలాం వ్యక్తిగత సమాచారాన్ని తన ట్విట్టర్ ఖాతాలోకి సింగ్ పోస్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. ఈ రెండు ఖాతాలను తమకు వెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఈ విషయమై కలామ్ బంధువు షేక్ దావూద్ మాట్లాడుతూ..ట్విట్టర్ ఖాతాను తెరవడానికి కలామ్ కు సింగ్ సాయం చేశాడన్నారు. 2015, జూలై 27న కలామ్ మరణం తర్వాత ఆయన సమాచారం మొత్తాన్ని సింగ్ దొంగిలించి సొంతంగా కలామ్ సెంటర్ పేరిట ఓ ట్విట్టర్ అకౌంట్ ను తెరిచాడని వెల్లడించారు. కలామ్ పేరుతో సింగ్ పలుచోట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని దావూద్ ఆరోపించారు. ఇది డిజిటల్ హక్కుల చౌర్యమేనని, సింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశామన్నారు. తాము రామేశ్వరంలో స్థాపించిన డా.ఏపీజే అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ ద్వారా కలామ్ కు సంబంధించిన వస్తువుల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని దావూద్ తెలిపారు.