Bangladesh: ప్రేమ జంట ముద్దు పెట్టుకుంటుండగా ఫొటో తీసిన జర్నలిస్ట్.. కొట్టి ఉద్యోగం లోంచి తరిమేసిన యాజమాన్యం
- యూనివర్సిటీలో వర్షంలో కపుల్ కిస్సింగ్
- ఫొటో తీసిన జర్నలిస్ట్
- దాడిచేసిన తోటి జర్నలిస్టులు
కొత్త దృశ్యాల కోసం పరితపించే ఓ ఫొటో జర్నలిస్టు తీసిన ఫొటో అతడిపై దాడికి కారణమైంది. అతడి ఉద్యోగాన్ని పోగొట్టింది. ఢాకా యూనివర్సిటీ ఆవరణలో వర్షంలో ఓ ప్రేమ జంట ముద్దు పెట్టుకోవడం ఫొటో జర్నలిస్టు జిబోన్ అహ్మద్ కంట పడింది. వెంటనే ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. తాను పనిచేస్తున్న పత్రిక ఎడిటర్‌కు దానిని పంపి ప్రేమకు ఇది ప్రతిరూపమని, ప్రచురించాలని కోరాడు.
ఈ ఫొటోను చూసిన తోటి ఫొటోగ్రాఫర్లు అతడిపై దాడి చేశారు. అతడి బాస్ కూడా ఐడీకార్డు, ల్యాప్‌టాప్ ఇచ్చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. ఎటువంటి కారణం లేకుండానే తనను వెళ్లిపొమ్మని చెప్పడంతో అహ్మద్ నిశ్చేష్టుడయ్యాడు. అతడిపై దాడి విధుల్లో భాగంగా జరిగిందని కాదని, అది వ్యక్తిగతమని న్యూస్ పోర్టల్ ఎడిటర్ ఖుజిస్తా నూర్-ఇ-నహరీన్ స్పష్టం చేశారు.
అతడు ఫొటో తీసినందుకు అందరూ అతడిని ప్రశంసించారని తెలిపారు. అయితే అతడు విధులకు సరిగ్గా హాజరు కాకపోవడంతోనే ఉద్యోగం నుంచి తీసివేసినట్టు వివరణ ఇచ్చారు. కాగా, అహ్మద్‌పై దాడి ఘటనతోపాటు ఉద్యోగం నుంచి తొలగించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మద్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ ఫొటోను పోస్టు చేయగా వైరల్ అయింది.