Chandrababu: ఏపీలో బీజేపీ ఆటలు సాగనీయం: సీఎం చంద్రబాబు

  • న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు
  • బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
  • నమ్మకద్రోహానికి గుణపాఠం చెబుతాం

ఏపీలో బీజేపీ ఆటలు సాగనీయమని, తెలుగుజాతికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని, తమకు అధికారం ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఒంగోలులో జరుగుతున్న ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం తమను బెదిరించాలని చూస్తోందని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, నమ్మకద్రోహానికి గుణపాఠం చెబుతామని, వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు.

దేశంలో పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏపీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని, 2019 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి నాటికి వెలిగొండ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక టన్నెల్ ను పూర్తి చేసి నీరందిస్తామని, ఏడాదిలోగా రెండో టన్నెల్ పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు.

కుట్ర రాజకీయాలు చేస్తూ కేసుల మాఫీ కోసం వైసీపీ లాలూచీ పడుతోందని, మోదీకి భయపడి ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఇళ్లలో ఉంటున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను వైసీపీ ఉచ్చులో పడలేదని, బీజేపీనే అవినీతి కుడితిలో పడిందని దుమ్మెత్తిపోశారు. అక్రమాస్తులు జప్తు చేస్తామని ప్రధాని మోదీ అన్నారని, అవినీతి కేసుల్లో నాలుగేళ్లుగా జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? లాలూచీ పడకపోతే జగన్ ఆస్తులు ఎందుకు జప్తు చేయలేదు? అని ప్రశ్నించారు. కేంద్రంపై తాము పోరాడుతుంటే, కొంతమంది బీజేపీతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  

  • Loading...

More Telugu News