modi: ప్రధాన మంత్రి గారూ, మెచ్యూరిటీ నాకు లేదో.. మీకు లేదో ఆలోచించుకోండి!: సీఎం చంద్రబాబు

  • ఒంగోలులో ధర్మపోరాట సభ
  • ప్రధానిపై విరుచుకుపడ్డ చంద్రబాబు
  • నాది యూటర్న్ కాదు రైట్ టర్న్

ఏపీకి ప్రత్యేకహోదా సాధించి తీరతామని, ఎవరూ ఆధైర్యపడొద్దని..ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్ష సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టం హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు గడగడలాడించారని, కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ‘హోదా’ సాధిస్తామని అన్నారు.

ఏపీకి ఇచ్చిన మాటపై నిలబడని మోదీ తీరుపై చంద్రబాబు నిప్పులు కురిపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆరోజున ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నానని.. ఇచ్చిన హామీలు ఎప్పుడైతే అమలు చేయలేదో అప్పుడు ఆ కూటమి నుంచి బయటకు రావాల్సి వచ్చిందని, దేశం, రాష్ట్రం కోసం ఆలోచించిన పార్టీ టీడీపీ అని అన్నారు.

ఓట్ల కోసం తిరుపతి వెంకన్న సాక్షిగా నాడు మోదీ ఇచ్చిన హామీలను విస్మరించారని, ప్రధాని మాటలు వింటుంటే చాలా బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని, పార్లమెంటు సాక్షిగా ప్రధాని స్థాయి వ్యక్తి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘నేను యూటర్న్ తీసుకున్నానని మోదీ అంటున్నారు.. నాది యూటర్న్ కాదు రైట్ టర్న్’ అని మరోసారి స్పష్టం చేశారు. ‘ఏపీని అద్భుతమైన నగరంగా చేసి చూపిస్తానని ఆరోజే చెప్పాను. అది నా పట్టుదల. ఈ పట్టుదలతో నేను పని చేస్తుంటే ప్రధానమంత్రి నాకు మెచ్యూరిటీ లేదని మాట్లాడతాడు. నాకు మెచ్యూరిటీ లేదో మీకు మెచ్యూరిటీ లేదో ప్రధాన మంత్రి గారూ ఆలోచించుకోవాలి’ అని చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు.

  • Loading...

More Telugu News