NGT: బీజేపీకి మిత్రపక్షం అల్టిమేటం.. మాట వినకుంటే ఆందోళనలో పాల్గొంటామని హెచ్చరిక!
- ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ గోయల్ ను తప్పించాలని ఎల్జేపీ డిమాండ్
- ఒప్పుకోకుంటే ఆగస్టు 10న భారత్ బంద్ లో పాల్గొంటామని హెచ్చరిక
- ప్రభుత్వంలో ఉంటూనే దళితుల కోసం పోరాడుతామని స్పష్టీకరణ
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకి మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అల్టిమేటం జారీచేసింది. ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఏకే గోయల్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టంలోని తక్షణ అరెస్ట్ నిబంధనను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు బెంచ్ లో గోయల్ సభ్యుడిగా ఉండటంతో ఆ పార్టీ ఈ మేరకు స్పందించింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే వచ్చే నెలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత, గిరిజన సంఘాలు చేపట్టే భారత్ బంద్ ఆందోళనల్లో పాల్గొంటామని హెచ్చరించింది.
దేశరాజధానిలో శుక్రవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ మాట్లాడుతూ.. గోయల్ ను ఎన్జీటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టంలో సుప్రీం రద్దు చేసిన తక్షణ అరెస్ట్ నిబంధనను పునరుద్ధరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. ఆగస్టు 9లోగా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత, గిరిజన సంఘాలు మరుసటి రోజు నిర్వహించే భారత్ బంద్ ఆందోళనల్లో పాల్గొంటామని హెచ్చరించారు. తాము తెలుగుదేశం పార్టీలా ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లబోమనీ, ప్రభుత్వంలో కొనసాగుతూనే దళిత, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతామని ప్రకటించారు. మరోపక్క, ఆగస్టు 10న నిర్వహించే భారత్ బంద్ లో భారీ హింస చెలరేగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.