Lunar eclipse: చంద్రగ్రహణం వేళ కృష్ణా జిల్లాలో కలకలం.. యువకుడిని బలిచ్చే ప్రయత్నం!
- అతీత శక్తుల కోసం నరబలికి ప్రయత్నం
- ముందే గోతులు తీసి పెట్టుకున్న మంత్రగాళ్లు
- చాకచక్యంగా తప్పించుకున్న యువకుడు
చంద్రగ్రహణం వేళ కృష్ణా జిల్లాలో నరబలి వార్తలు కలకలం రేపాయి. గ్రహణం వేళ నరబలి ఇస్తే అతీత శక్తులు సిద్ధిస్తాయన్న నమ్మకంతో కొందరు మంత్రగాళ్లు ఓ యువకుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే సదరు యువకుడు చాకచక్యంగా తప్పించుకోవడంతో బతికి బయటపడ్డాడు. నూజివీడు మండలం యనమదలలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.
వందేళ్లకు ఓసారి వచ్చే ఇటువంటి చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే అతీత శక్తులు వస్తాయన్న మూఢ నమ్మకంతో ఏడుగురు వ్యక్తులు గ్రామ పొలిమేరలో గుంతలు తవ్వి సిద్ధం చేసుకున్నారు. 32 ఏళ్ల యువకుడికి మాయమాటలు చెప్పి పొలిమేరల్లోకి తీసుకొచ్చారు. అయితే, వారి తీరుపై అనుమానం వచ్చిన యువకుడు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ గుంతలు తవ్వి ఉండడాన్ని చూసి నరబలికి ప్రయత్నాలు జరిగినట్టు నిర్ధారించుకున్నారు. పరారీలో ఉన్న మంత్రగాళ్ల కోసం గాలిస్తున్నారు.