Pawan Kalyan: పవన్‌ను ఎదుర్కొనే దమ్ము లేకే జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు: నాగబాబు ఫైర్

  • జగన్ వ్యాఖ్యలు అభద్రతా భావానికి నిదర్శనం
  • వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు
  • వైసీపీ, టీడీపీలు తక్కువ అంచనా వేస్తున్నాయి

తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ఓ పార్టీ అధినేతగా జగన్ నోరు జారడం తగదన్నారు. తన సోదరుడిని ఎదుర్కొనే దమ్ములేకే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. మిగతావారు మాట్లాడడం వేరు, పార్టీ అధినేతగా జగన్ మాట్లాడడం వేరన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

రాజకీయాల్లోకి వద్దంటూ తాము చెప్పినా వినకుండా ప్రజా సేవ కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని పేర్కొన్నారు. తప్పు చేస్తే అంగీకరించే దమ్ము పవన్‌కు ఉందన్న నాగబాబు, సినిమాల్లో నంబర్ వన్ స్థానాన్ని వదులుకుని మరీ రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ ఎవరినీ నమ్మించి మోసం చేయలేదని, ఇద్దరి నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే ఆయన మరో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. విడాకులకు కారణమేంటనేది భార్యాభర్తలకు సంబంధించిన విషయమని, ఈ విషయంలో ఎటువంటి వివాదం లేదని స్పష్టం చేశారు. న్యాయంగా బతుకుతున్న పవన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.

వివాహాలు చేసుకుని అక్రమ సంబంధాలు నడుపుతున్న వారి సంగతేంటని నాగబాబు ప్రశ్నించారు. పవన్‌ను రాజకీయంగా విమర్శించడానికి సరైన కారణం లేకపోవడంతో వైవాహిక జీవితాన్ని బయటకు ఈడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలు ఆయన అభద్రతా భావాన్ని చూపిస్తున్నాయన్నారు. ఏపీలో పవన్ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నాడని, ఆయనను తక్కువగా అంచనా వేయొద్దని వైసీపీ, టీడీపీలను నాగబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News