cm chandrababu: లాలూచీపడ్డ వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో పడుకున్నారు: సీఎం చంద్రబాబు

  • వైసీపీ అధ్యక్షుడు జగన్ కు భయం పట్టుకుంది
  • అందుకే, ఆయన బీజేపీ పంచన చేరారు
  • ప్రత్యేకహోదా ఇచ్చే దాకా కేంద్రాన్ని వదలం

బీజేపీతో లాలూచీపడ్డ వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఇంట్లో పడుకున్నారని సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో నిర్వహించిన నగర దర్శిని కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధ్యక్షుడు జగన్ కు భయం పట్టుకుందని, అందుకే, ఆయన బీజేపీ పంచన చేరి రాష్ట్ర సర్కార్ ను విమర్శిస్తున్నారని, ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ పార్టీకి జగన్ అండగా నిలుస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే దాకా కేంద్రాన్ని వదిలిపెట్టబోమని, 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ‘హోదా’ రాకుండా మోదీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన బీజేపీపై జగన్, పవన్ కల్యాణ్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని, టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి వీళ్లిద్దరూ అండగా నిలుస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై నమ్మకంతోనే రాజధానికి రైతులు తమ భూములిచ్చారని, వారిని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పార్టీలకు ఓట్లు వేయడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని, ఏ పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. టీడీపీని వంద శాతం అఖండ మెజార్టీతో గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లాను నా జీవితంలో ఎన్నడూ మర్చిపోలేను. ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను. జిల్లాను సమస్యలు లేని జిల్లాగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాలా ముందుంటాను. మన పార్టీకి గానీ.. మనకు గానీ పదవులు ముఖ్యం కాదు. మనకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు, బాగోగులు. వాటి కోసం పోరాడతాం.. సాధిస్తాం. ఇందుకు రాష్ట్ర హితం కోరే వారంతా మద్దతివ్వాలి, రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీ అందించాలి’ అని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News