Pawan Kalyan: పవన్-జగన్ వివాదానికి దూరంగా ఉండండి.. టీడీపీ నేతలకు అధిష్ఠానం సూచన!
- పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్
- తాను నోరు విప్పితే బాగుండదన్న పవన్
- తలదూర్చవద్దన్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఏపీలో నిర్వహించిన బంద్ ముగిసిన తర్వాత జగన్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగైదేళ్లకోసారి కార్లను మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
జగన్ వ్యాఖ్యలకు పవన్ కూడా స్పందించారు. వ్యక్తిగత విషయాల జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. తాము కనుక నోరు విప్పితే జగన్ తట్టుకోలేడన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే.. తమకెంత ఉండాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు, జగన్ వ్యాఖ్యలను టీడీపీ సహా పలుపార్టీల నేతలు తప్పుబట్టారు. అయితే, జగన్-పవన్ వివాదంలో తలదూర్చవద్దని టీడీపీ అధిష్ఠానం నుంచి నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అది వాళ్లిద్దరూ తేల్చుకోవాల్సిన విషయమని, మధ్యలో తలదూర్చి ఇరుక్కోవద్దని అధిష్ఠానం సూచించింది.
దీంతో ఇదే విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విజయవాడ నగర ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే వెనక్కి తగ్గారు. సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరినప్పుడు చాలామంది నేతలు నిరాకరించారు.