KCR: ఆగస్టు 1న గజ్వేల్ లో లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి: సీఎం కేసీఆర్

  • అదేరోజు అటవీ భూముల్లోనూ మొక్కలు నాటాలి
  • మొక్కలు నాటడం, సంరక్షించడం మన విధి కావాలి 
  • ప్రతి ఏటా వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలి 

తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీటికి అదనంగా అదేరోజు అటవీ భూముల్లో మరో ఇరవై వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రగతి భవన్ లో ఈరోజు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో లక్షా 116 మొక్కలు నాటాలని కోరారు. అన్ని రకాల రోడ్ల వెంబడి, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల ఆవరణలో, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాల్లో, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని, ఇది విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.

 నాటిన మొక్కలను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై నాటే మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణంలో తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చి మొక్కలను తీసేసి, మంచి మొక్కలను మాత్రమే పెంచాలని, మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ధ కనబరిచిన వారికి అవార్డులు కూడా అందించాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొక్కలు నాటడం, వాటిని రక్షించడం మన ప్రధాన విధి కావాలని, ఈ కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఉపాధి హామీ పథకం నిధులను ఇందుకు వినియోగించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News