Andhra Pradesh: ఏపీ జర్నలిస్టుల గృహనిర్మాణంపై మార్గదర్శకాలు ఖరారు!
- అధికారులతో చర్చించిన మంత్రి కాలవ
- రేపు జారీ కానున్న ఉత్తర్వులు
- ఆన్ లైన్ లో స్వీకరించనున్న దరఖాస్తులు
రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జర్నలిస్టుల గృహ నిర్మాణ కార్యక్రమానికి మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఏపీ సమాచార పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు సంబంధిత అధికారులతో చర్చించి తుదిరూపు ఇచ్చారు. ఏపీ సచివాలయంలోని సమాచార, గృహ నిర్మాణ శాఖల అధికారులతో దీనిపై సమగ్రంగా చర్చించి మార్గ దర్శకాలు ఖరారు చేశారు.
జర్నలిస్టుల గృహ నిర్మాణం విధివిధానాలపై ఇందుకు సంబంధించి రేపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించి జర్నలిస్టుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, అర్హుల గుర్తింపునకు సంబంధించి సమాచార, గృహనిర్మాణ శాఖల ఆధ్వర్యంలో వెబ్‌సైట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే ఈ వెబ్‌సైట్ జర్నలిస్టులకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కాలవ ఆదేశించారు.
జర్నలిస్టుల అక్రిడేషన్, ఆధార్ నెంబర్ల ఆధారంగా ఆన్‌లైన్‌లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి, అర్హులను గుర్తించేందుకు ఎలాంటి లోపాలు లేని సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి సిద్ధం చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఈ పథకం వర్తించేలా చూడాలని ఆదేశించారు.