Pawan Kalyan: ఐదేళ్లు గట్టిగా కష్టబడితే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవచ్చు!: పవన్ కల్యాణ్
- ఆ కుర్చీలో కూర్చుంటే సమాజంలో ఏ మార్పూ రాదు
- రాజకీయాలకు వేల కోట్లు, గూండాలు అవసరం లేదు
- ఆశయం కోసం తెగించే గుణం ఉంటే చాలు
రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోయిందని, మరిచిపోయిన మానవత్వాన్ని,
జవాబుదారీతనాన్ని రాజకీయాల్లో మళ్లీ తీసుకురావడానికే జనసేన పార్టీ పెట్టానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో తమ పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ‘రాజకీయాలకు వేల కోట్లు, గూండాలు అవసరం లేదు. ఆశయం కోసం తెగించే గుణం ఉంటే చాలు. ‘జనసేన’ అటువంటి ఆశయంతో ప్రజా శ్రేయస్సుకు పోరాటం చేస్తుంది...సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేనే ఈ స్థాయికి వస్తే, బాగా చదువుకున్న మీరు ఏ స్థాయికి వెళ్లగలరో ఊహించుకోవాలి.
ఒక తరంలో మార్పు రావాలంటే 25 ఏళ్లు పడుతుంది. అందుకే, నేను ఇరవై ఐదేళ్లు రాజకీయాలు చేయడానికి వచ్చానని తరచూ చెబుతున్నా. ఐదేళ్లు గట్టిగా కష్టబడితే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవచ్చు కానీ, దానివల్ల సమాజంలో ఏ మార్పు రాదు. ఒక సామాజిక మార్పు తెచ్చేందుకు మరింత ప్రణాళికతో ముందుకు వెళ్లాలి’ అని పవన్ సూచించారు.