Hyderabad: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!

  • న్యూయార్క్ లోని షాపు నుంచి అర్ధంతరంగా బయటకు
  • ఆచూకీ కనిబెట్టాలని సుష్మాకు యువకుడి తండ్రి లేఖ
  • కేసు నమోదు చేసుకున్న న్యూజెర్సీ పోలీసులు

అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అదృశ్యమయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనైన స్నేహితులు అక్కడి పోలీసుల్ని ఆశ్రయించారు. నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన మిర్జా అహ్మద్ అలీ బేగ్ (26) మాస్టర్స్ చదివేందుకు 2015లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్ లో ఓ మొబైల్ షాపులో పార్ట్ టైమ్ పనిచేసుకుంటూ బేగ్ చదువును కొనసాగిస్తున్నారు.

ఈ నెల 20న తల్లితో ఫోన్ లో మాట్లాడిన బేగ్.. తనకు భయంగా ఉందని చెప్పాడు. అయితే తనను ఎవరైనా బెదిరిస్తున్నారా? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన సోదరుడు షుజాత్ బేగ్ ఫోన్ కు 2-3 సార్లు కాల్ చేయగా, ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. మరోసారి కాల్ చేయగా, ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అప్పట్నుంచి బేగ్ ఆచూకీ తెలియరాలేదు.

దీంతో  ఆందోళన చెందిన షుజాత్ వెంటనే బేగ్ పనిచేస్తున్నమొబైల్ షాపుకు కాల్ చేయగా, అతను ఎవ్వరికీ చెప్పకుండా అర్థంతరంగా షాపు నుంచి బయటకు వెళ్లిపోయాడని యజమాని జవాబిచ్చాడు. బేగ్ షాపు నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలోనూ రికార్డయ్యాయి. తన సోదరుడ్నిఎవరో బెదిరిస్తున్నారని షుజాత్ ఆరోపించారు.

మరోవైపు బేగ్ అదృశ్యం కావడంపై అతని స్నేహితుడొకరు న్యూజెర్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేగ్ గదిని పరిశీలించగా.. పాస్ పోర్ట్ సహా ఎలాంటి డాక్యుమెంట్లు లభ్యం కాలేదు. కాగా, తన కుమారుడి ఆచూకీని కనిబెట్టాలని బేగ్ తండ్రి ఇస్మాయిల్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. బేగ్ జాడ కనిబెట్టేందుకు సాయం చేయాలని ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ అమెరికాలోని భారత దౌత్య కార్యాలయానికి లేఖ రాశారు.

సంతోష్ నగర్ కు చెందిన బేగ్ పెన్సిల్వేనియాలో ఉన్న గన్నన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు 2015లో అమెరికాకు వెళ్లాడు. కానీ కొద్ది కాలానికే న్యూజెర్సీలోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీకి మారాడు.

  • Loading...

More Telugu News