Pawan Kalyan: అవకాశాలు వచ్చినా వ్యాపారం చేయకపోవడానికి కారణమదే: పవన్ కల్యాణ్
- వ్యాపారం చేసేవాడు నాయకుడు అయితే ప్రజలకు న్యాయం జరగదు
- ప్రపంచంలో గొప్ప నాయకులకు వ్యాపారాలు లేవు
- ఆక్వా రైతుల సమావేశంలో పవన్ కల్యాణ్
గతంలో తనకు ఎన్నో వ్యాపార అవకాశాలు వచ్చాయని, అయితే, వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులు నాయకుడిగా ఎదగలేరని, ప్రజలకు న్యాయం జరగదన్న అభిప్రాయంతోనే తాను ఏ రంగంలోనూ పెట్టుబడులు పెట్టలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, తనకు రాజకీయాలపై పూర్తి స్పష్టత ఉందని, ఎలాంటి అనుమానాలూ లేవని, క్లారిటీ తీసుకున్న తరువాతే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఒకసారి దెబ్బతిన్నాక మళ్లీ రాజకీయ పార్టీ పెట్టడం పెద్ద సాహసమని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని తాను పార్టీ పెట్టానని చెప్పారు. ప్రపంచంలో ఏ గొప్ప రాజకీయ నాయకునికీ వ్యాపారాలు లేవని గుర్తు చేశారు.
తాను జనసేనను స్థాపించినప్పుడు తన చుట్టూ ఎవరూ లేరని గుర్తు చేసిన ఆయన, ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. జనసేనకు కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, తనకు కులపిచ్చి ఉంటే 2014లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తానని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఇటాలియన్ పార్టీ అని, బీజేపీని హిందువుల పార్టీ అని కూడా అన్నారని గుర్తు చేసిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఉన్నంత మాత్రాన అది వైశ్యుల పార్టీ కాలేదని చెప్పారు. గోదావరి జిల్లాల్లోనే జనసేన బలముందని కొందరు అంటున్నారని, అందువల్లే తొలుత ఉత్తరాంధ్రలో పర్యటించి బలం చూపించామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.