rajnath singh: మా ప్రధాని, నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: రాజ్ నాథ్ సింగ్
- బాబు ఆమోదం తర్వాతే ప్యాకేజ్ కు తుదిరూపిచ్చాం
- ఏపీకి ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తాం
- ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం.. చేస్తాం
రాష్ట్ర విభజనకు సంబంధించి మా ప్రధాని మోదీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఆమోదం తీసుకున్న తర్వాతే ప్రత్యేక ప్యాకేజ్ కు తుదిరూపు ఇచ్చామని అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ ద్వారా ఎక్కువ లాభం చేకూరుతుందని చంద్రబాబు గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ఏపీకి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని చెప్పామని, ఈ లోటు కింద ఐదేళ్లలో రూ.22,123 కోట్లు ఇస్తామని అన్నారు. ఈఏపీలకు సంబంధించిన రుణాలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం.. చేస్తామని చెప్పారు. విభజన చట్టంలోని 90 శాతం హామీలను అమలు చేశామని, మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, రైల్వేజోన్, ఇతర అంశాలపై కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీ, తెలంగాణ..రెండు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఏపీలో రైల్వేజోన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సానుకూలత చూపలేదని, అయినప్పటికీ పరిశీలిస్తామని, రైల్వేజోన్ ఏర్పాటు చేసి తీరతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక కేటగిరి మధ్య నిధుల కేటాయింపులో ఎలాంటి వ్యత్యాసం లేదని అన్నారు.