Finance Minister: దేశ ఆర్ధిక‌మంత్రి నిద్ర‌పోతున్నారా...?: బాంబే హైకోర్ట్ తీవ్ర ఆగ్ర‌హం

  • నెల‌రోజులుగా ప‌నిచేయ‌ని ముంబైలోని డీఆర్ టీ
  • హైకోర్టును ఆశ్రయించిన డీఆర్ టీ బార్ అసోసియేష‌న్
  • కేంద్ర ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు 

కేంద్ర‌ప్ర‌భుత్వంపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశ ఆర్థిక‌మంత్రి నిద్రపోతున్నారా? అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ముంబైలోని రుణాల రిక‌వ‌రీ ట్రైబ్యున‌ల్ (డీఆర్ టీ) నెల‌రోజులుగా ప‌నిచేయ‌క‌పోవ‌డ‌మే హైకోర్టు ఆగ్ర‌హానికి కార‌ణం. జూన్ 2న‌ ద‌క్షిణ ముంబైలోని బ‌లార్డ్ ఎస్టేట్ వ‌ద్ద ఉన్న ఓ భ‌వ‌నంలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. డీఆర్ టీ కార్యాల‌యం కూడా ఈ భ‌వ‌నంలోనే ఉంది. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా డీఆర్ టీని మూసివేశారు. అప్ప‌టినుంచి కేంద్రం డీఆర్ టీకీ మ‌రో భ‌వ‌న‌మేదీ కేటాయించ‌లేదు. దీనిపై డీఆర్ టీ బార్ అసోసియేష‌న్ బాంబే హైకోర్టును ఆశ్ర‌యించింది. ద‌క్షిణ ముంబైలో ట్రిబ్యున‌ల్ కు  మ‌రో భ‌వ‌నం కేటాయించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాల‌ని త‌న పిటిష‌న్ లో కోరింది.

ఈ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన జ‌స్టిస్ ఏ ఎస్ ఓకా, జ‌స్టిస్ రియాజ్ చాగ్లాతో కూడిన ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. డీఆర్ టీ కోసం ప్ర‌త్యామ్నాయ భ‌వనాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో తెలుసుకోవాల‌నుకుంటున్నామ‌ని వ్యాఖ్యానించింది. స‌మ‌స్య త‌మ దృష్టికి రాక‌ముందే, ఆదేశాలు ఇవ్వ‌క‌ముందే.. కేంద్ర‌ప్ర‌భుత్వం తనకు తానుగా ఈ ప‌నిచేసి ఉండాల్సింద‌ని జ‌స్టిస్ ఓకా అన్నారు. దేశ ఆర్ధిక రాజ‌ధానిలో రుణాల రిక‌వ‌రీ ట్రైబ్యున‌ల్ కార్యాల‌యం మూసి ఉందంటే ఆర్ధిక మంత్రి నిద్రపోతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25కు వాయిదా వేసిన హైకోర్టు అప్ప‌టిలోగా ట్రైబ్యున‌ల్ కు మ‌రో భ‌వ‌నం కేటాయించాల‌ని ఆదేశించింది. బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల నుంచి రుణాల ఎగవేతదారులకు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్ టీ ప‌రిశీలిస్తుంది.

  • Loading...

More Telugu News